V6 News

టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ నగదు పురస్కారాలు

టోక్యో ఒలింపిక్స్ విజేతలకు బీసీసీఐ నగదు పురస్కారాలు
  • బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1 కోటి ప్రకటించిన బీసీసీఐ
  • రజత పతకం సాధించిన వారికి అరకోటి, కాంస్య పతకాలు సాధించిన వారికి 25 లక్షల చొప్పున బహుమతి
  • మరికొద్ది గంటల్లో ముగియనున్న టోక్యో ఒలింపిక్స్ 
  • ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కు ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు


టోక్యో: ఒలింపిక్స్ విజేతలకు బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా(బీసీసీఐ) నగదు పురస్కారాలు ప్రకటించింది. బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1 కోటి ప్రకటించిన బీసీసీఐ రజత పతకం సాధించిన వారికి అరకోటి, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.25 లక్షల నగదు పురస్కారాలు ప్రకటించింది. 
గత కొన్నివారాలుగా క్రీడాభిమానులను విశేషంగా అలరించిన టోక్యో ఒలింపిక్స్ ఆదివారం ముగియనున్న విషయం తెలిసిందే. టోర్నీ ముగింపు ఒక్క రోజు ముందు భారత్ కు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నీరజ్ చోప్రా పై ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా స్పందించి ఒలింపిక్స్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పురస్కారాలు ప్రకటించడం విశేషం.  
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటిదాకా 7 పతకాలు సాధించగా జావెలిన్ త్రో అంశంలో బంగారు పతకంతో నీరజ్ చోప్రా మంచి ఫినిషింగ్ ఇచ్చాడంటూ బీసీసీఐ కితాబునిచ్చింది. అందుకే బంగారు పతకంతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నీరజ్ చోప్రాకు రూ.1 కోటి అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అలాగే రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు చొప్పున, కాంస్య పతకాలు సాధించిన పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా బొర్గోహైన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రదానం చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.